NTV Telugu Site icon

CM Jagan : తెలుగు జాతికి చిరస్మరణీయుడు అల్లూరి

Cm Jagan

Cm Jagan

CM Jagan Speech at Alluri Sitarama Raju Jayanti Utsav.

తెలుగువారి పౌరుషానికి ప్రతీకైన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి సందర్భంగా నేడు ఏపీలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామ రాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపై ప్రధాని మోడీ సహా 9మంది మాత్రమే కూర్చునే ఏర్పాట్లు చేశారు. ఈ సభలో ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవికి కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి (మన భీమవరానికి) వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవికి, ఇతర పెద్దలకు, మిత్రులకు, అందరికీ సభాధ్యక్షుని హోదాలో సాదరంగా స్వాగతం పలికారు.

సభకు వచ్చిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, అందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈరోజు ఇక్కడ మనమంతా ఏకమయ్యాం. ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర్య యోధులందరూ కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న సంవత్సరం. మన స్వాతంత్ర్యానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దానర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర్య సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఈ ఆజాదీ కా అమృత్‌ అనే పదానికి అర్థం. 75 ఏళ్ల క్రితం వరకూ జరిగిన మన దేశ స్వాతంత్ర్య సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు అంటే దాదాపు 190 సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి మన భారతదేశం.

అటువంటి మహా త్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్ర మట్టి నుంచి, ఇక్కడి ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగధనులల్లో, అటువంటి పోరాటయోధులల్లో ఒక మహా అగ్నికణం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డలా ఈ విషయాన్ని చెప్పటానికి చాలా గర్విస్తున్నాను. అడవిలో కూడా అగ్గిపుట్టించిన ఆ యోధుడు, ఆ సంస్కర్త సామాజిక ఐకమత్య అవసరాన్ని తెలియజెప్పాడు. భావాలపరంగా ఎన్నటికీ మరణంలేని విప్లవ వీరుడు అల్లూరిని స్మరించుకునేందుకు మనమంతా మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమక్షంలో సమావేశమయ్యా.

తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన ఆ మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్య దేవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు ఘనతను గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టే ఆయన నడయాడిన నేలకు, ఆయన నేలకొరిగిన ప్రదేశమున్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరుపెట్టాం. ఈరోజు ఇక్కడ ఏవిధంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతోందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నాం.

తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహా మనిషిని తెలుగు జాతి ఎప్పటికీ మరిచిపోదు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తననుతానే త్యాగం చేసుకున్న ఆ మహా వీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు. అతని త్యాగం ప్రతి పాపా, ప్రతి బాబూ, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలంగా నిలిచిపోతుందని తెలియజేస్తున్నాను. అమర్‌ రహే అల్లూరి సీతారామరాజు. అమర్‌ రహే అల్లూరి సీతారామరాజు. జైహింద్‌’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.