NTV Telugu Site icon

Andhra Pradesh: జూన్‌లో అమ్మ ఒడి.. జూలైలో జగనన్న విద్యాకానుక

Cm Jagan

Cm Jagan

విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్‌ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు.

టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుముద్ద కార్యక్రమాలపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా కార్యక్రమాలను సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలని, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటామని తెలిపారు. గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉండేవి అని.. కానీ ఈరోజు ఏకంగా 1200 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కళాశాల లేదా కేజీబీవీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. తద్వారా వీటిని బాలికలు వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, బాత్రూమ్‌ల నిర్వహణ వంటివి సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. దీని కోసం పక్కాగా ఎస్‌ఓపీలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. అటు జగనన్న విద్యాకానుక కిట్‌ నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కిట్ల పంపిణీకి సర్వం సన్నద్ధంగా ఉండాలన్నారు. జూలై 4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభానికి సకలం సన్నద్ధం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

Bonda Uma: ఏపీలో ఉన్న బీసీ నేతలు జగన్‌కు పనికిరారా?

మరోవైపు జూన్‌లో అమ్మ ఒడి నిధులు పంపిణీ చేసేలా అధికారులు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇంగ్లీష్‌లో మంచి ప్రావీణ్యం సంపాదించిన బెండపూడి విద్యార్ధులను సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. బెండపూడి హైస్కూల్‌ ఇంగ్లీషు టీచర్‌ ప్రసాద్‌ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించిన బోధనా విధానాన్ని ఎస్‌ఓపీగా రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఈ తరహా లెర్నింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేలా చూడాలన్నారు. ఫొనిటిక్స్‌పై ప్రస్తుతం రీసెర్చ్‌ చేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యులను చేయాలన్నారు. ఇంగ్లీష్ భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్, డైలెక్ట్‌ చాలా ప్రధానమైన అంశాలని సూచించారు. ఈ విషయాలపై అధికారులు ఎక్కువ ఫోకస్‌ పెట్టాలన్నారు. గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ ప్రతి టీచర్‌ మొబైల్‌లో ఉండేలా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు.