Site icon NTV Telugu

Botsa Satyanarayana: ఈనెల 16 లేదా 17న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు. భవిషత్ కార్యాచరణ రూపొందించడానికి జిల్లాలో అందరూ ఇప్పటి వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు. చిన్నపాటి అసంతృప్తి ఉన్నా చర్చించుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతి సచివాలయనికి ముగ్గురు పార్టీ సమన్వయకర్తలను నియమించాలని మంత్రి బొత్స అన్నారు. ప్రతి వాలంటీర్ పరిధిలో ఇద్దరు గృహసారధులను నియమించాలని.. వీరే ఎన్నికల బూత్ కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు, సమాచారం కోసం వీరంతా పని చేస్తారని వివరించారు. అందరూ సమన్వయంతో వ్యవహరిస్తే జిల్లాలో గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయవచ్చన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని మంత్రి బొత్స ఆరోపించారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అసత్యాలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: Komatireddy Venkat Reddy: సజ్జల వ్యాఖ్యలు సరైనవి కావు

మరోవైపు విజయనగరం జిల్లా పర్యటనలో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలోని అంశాలను ఇప్పటి వరకు 98శాతం అమలు చేశామని.. ఎన్నికల హామీల్లో భాగంగా పథకాల అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని కొనియాడారు. పథకాలు అమలు చేయటమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చామని.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గృహాల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మళ్ళీ అధికారంలోకి వస్తే పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు చెబుతున్నారని.. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని తాను ప్రశ్నిస్తున్నానని అన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం, సమాన అభివృద్ధి చేయాలని సీఎం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారన్నారు. రానున్న ఎన్నికల కోసం సీఎం దశాదిశ నిర్దేశించారని.. అందులో భాగంగానే సచివాలయ సమన్వయ కర్తలు, గృహసారథుల నియామకం జరిగిందన్నారు. సీఎం ఆదేశాలను., నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. అందరూ సమన్వయంతో సమిష్టిగా పని చేసి గత ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు.

Exit mobile version