ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఏపీ ముఖ్యమంత్రి నోట ఈ మధ్య కాలంలో ఎన్నికల మాట వినిపిస్తోంది. ముందస్తు వున్నా లేకున్నా. వైసీపీ నేతలు జనంలోకి వెళ్లాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశించడం వెనుక వ్యూహం ఏంటనేది అంతుపట్టడం లేదు. ప్రజల్లో ఉండటం పైనే సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నారు. 12వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా మంత్రులకు సీఎం జగన్ డైరెక్షన్ ఇవ్వడం వెనుక వ్యూహం అదేనా అనే చర్చ సాగుతోంది. మంత్రులకు రెండు రోజులే శాఖాపరమైన డ్యూటీ అప్పగించారు.
సోమ, మంగళవారాల్లో సెక్రటేరియట్లో వుండాలని సీఎం జగన్ క్లాస్ పీకారు. మిగిలిన 5 రోజులు జనంతోనే ఉండాలని మంత్రులకు జగన్ ఉపదేశించడం వెనుక త్వరలో ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి, 2023 ఎలక్షన్ ఇయర్ కానుందా? తెలంగాణ సీఎం కేసీఆర్ 2018లో చేసిన పని.. జగన్ చేయబోతున్నారా? 2023లోనే ముందస్తుకి వెళ్ళి మరోసారి సీఎం పీఠం ఖాయం చేసుకోబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 2022 నుంచే రాబోయే ఎన్నికలకు జగన్ ప్లాన్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా గతంలో కొట్టినట్టుగానే టీ20 మ్యాచ్ స్కోర్ చేయాలని భావిస్తున్నారు. 150 కి తగ్గకుండా సీట్లు సాధించాలని ఆయన భావిస్తున్నారు. సింహం సింగిల్ గానే వస్తుందని చెబుతున్న వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తో మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు.
2019లో ఓట్ల సునామీ వచ్చి 151 సీట్ల తిరుగులేని ఆధిపత్యంతో జగన్ అనే నేను… అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పథకాలతో పాటు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.జనంలో తనకున్న క్రేజ్ ని ముందస్తు ఎన్నికల ద్వారా మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు జగన్.
ఏపీలో జిల్లాల విభజన కూడా పూర్తయింది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీ సాక్షిగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విశాఖ కేంద్రంగా ఏపీ రాజధానిని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. కొత్త జిల్లాల్లో పార్టీ పటిష్టత, ఎన్నికలకు సమాయత్వం చేయడం సీనియర్లకు అప్పగించారు. మాజీ మంత్రులకు ఈ గురుతర బాధ్యత అప్పగించిన సంగతి తెలిసిందే. విపక్షం అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో జనం ముందుకి వెళ్ళి మరోసారి అధికారపగ్గాలు చేజిక్కించువాలని ఉవ్విళ్ళూరుతున్నారు.
మిషన్ 2023 పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం వుంది. 2019లో వచ్చిన మెజారిటీ ఏమాత్రం తగ్గకుండా.. 2023లో ఓట్లు రాబట్టాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. విశాఖ విషయంలో జగన్ కి ఒక విజన్ వుందని ఇటీవల సినిమా వారితో చర్చలు జరిపినప్పుడు కూడా ప్రముఖంగా విశాఖను ప్రస్తావించారు. సాగరతీరం విశాఖ నుంచే పాలన సాగించేందుకు సిద్దం అవుతున్నారు. పాత మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిలో జవాబుదారీతనం పెంచాలని జగన్ భావిస్తున్నారు.
2024 వరకు ఎన్నికలకు సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికల దిశగానే జగన్ ఆలోచన వుంది. స్పష్టమైన లక్ష్యాలతో, జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో తయారుచేసే పనిలో వున్నారు జగన్. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే మిగతా పార్టీలకు కూడా కంటిమీద కునుకు వుండదంటున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో ఎన్నికల హీట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఇప్పటికే గడపగడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతల్ని క్షేత్రస్థాయికి పంపి జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించేందుకు ఈ కార్యక్రమం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. మంత్రులు 5 రోజుల పాటు తమ తమ నియోజకవర్గాల్లో తిరిగితే ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతపై ఒక క్లారిటీ రానుంది. ఏది ఏమైనా రాబోయే ఆరునెలల పాటు జగన్ పార్టీ పటిష్టత, ఎన్నికలకు సిద్దం కావడంపై ఫోకస్ పెడతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Chandrababu: తప్పుడు కేసులు పెట్టినవారిపై దర్యాప్తు చేయిస్తా..!