ప్రకాశం జిల్లా ఒంగోలులో సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుసగా మూడో ఏడాది సున్నా వడ్డీ పథకం కింద నిధులను ఆయన జమ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసమంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాము రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామన్నారు. ఏపీ మరో శ్రీలంకలా మారుతుందని విష ప్రచారం చేస్తున్నారని.. పేదరికంలో ఉండి అలమటిస్తున్న వారికి పథకాలు అమలు చేయడానికి వీల్లేదని దుష్టచతుష్టయం అంటోందని ఆరోపించారు.
అటు తమ ప్రభుత్వం మంచిది కాదని చంద్రబాబు దత్తపుత్రుడు చెబుతున్నారని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి జగన్ ఎద్దేవా చేశారు. మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. మహిళలను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని, సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. మహిళలకు రూ.3,036 కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని జగన్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కింద తొలి ఏడాది రూ.1258 కోట్లు, రెండో ఏడాది రూ.1096 కోట్లు, మూడో ఏడాది రూ.1261 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు.