ఏపీ అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్‌లకు అనుమతి ఇచ్చారని.. ఈ బ్రాండ్‌లన్నీ చంద్రన్న కానుకలే అని జగన్ ఆరోపించారు. 2019 తర్వాత ఏపీలో ఒక్క మద్యం బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్లు లేనే లేవని, ఆయా బ్రాండ్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు.
తాము 16 కొత్త జిల్లాలు, మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే.. చంద్రబాబు 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అంటే కరెక్టుగా సూట్ అవుతుందన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ అబద్ధాలు చెబుతోందని సీఎం జగన్ మండిపడ్డారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని.. వారిని జూలో పెట్టాలని జగన్ ఆరోపించారు. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీ పరంగా టీడీపీ, మీడియా పరంగా ఎల్లో మీడియా అనేవి ఏపీలో అసలు సిసలు చీప్ బ్రాండ్స్, చీప్ ఫెల్లోస్ అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరు ఏపీలో లేకున్నా వీరి వక్రీకరణలు ఏపీలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని విమర్శించారు. వీళ్లందరూ మహిళా వ్యతిరేకులని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో చీప్ లిక్కర్ లేదని, రాష్ట్రప్రభుత్వమే ప్రాసెస్డ్, డిస్టిల్డ్ లిక్కర్ అమ్ముతోందని జగన్ పేర్కొన్నారు.
