NTV Telugu Site icon

CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై సీఎం చంద్రబాబు ట్వీట్.. పనులు వేగవంతం కోసమే..

Babu

Babu

CM Chandrababu: మంత్రులకు ర్యాంకులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలి రోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు శాయశక్తులా కష్టపడుతున్నామని ఆయన తెలిపారు. పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు లాంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే.. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనతో అభివృద్దివైపు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Read Also: Flight Missing: అమెరికాలో విమానం మిస్సింగ్.. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే..

అయితే, ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలి అని సీఎం చంద్రబాబు సూచించారు. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని నేను నమ్ముతాను.. అసాధారణ, వేగవంతమైన పని తీరు చూపితే తప్ప.. విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేం అన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్ తో పని తీరుపై సమీక్షించుకుని పని చేయాలన్నదే మా ఆలోచన అని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం.. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదు.. ఎవరినీ తక్కువ చేయడానికి కాదు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Netflix: నెట్ ఫ్లిక్స్ మళ్ళీ గట్టి ఫోకస్ పెట్టిందే!

ఇక, ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు ఒకరితో ఒకరు పోటీ పడి పని చేయడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇది.. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది.. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా కేబినెట్ సహచర మంత్రులంతా పని చేస్తున్నాం.. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాం.. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పని చేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి.. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలం అన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.