CM Chandrababu : దేశ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య (CII) కీలక పాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు-2026లో పాల్గొన్న ఆయన, భారతదేశ ఆర్థిక వృద్ధి , భవిష్యత్తు సవాళ్లపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుస్థిరమైన పాలన అందిస్తూ, దేశాన్ని ప్రపంచ పారిశ్రామిక పటంలో అగ్రగామిగా నిలబెడుతున్నారని ఆయన ప్రశంసించారు. వినూత్న ఆలోచనలు , స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని, 1990లలో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల సత్ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలపై పడుతున్న తరుణంలో, భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ సూచించిన ‘ఏడు విజ్ఞప్తులకు’ చంద్రబాబు పూర్తి మద్దతు ప్రకటించారు. బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం, ఇంధన పొదుపు, ప్రజా రవాణాను ప్రోత్సహించడం, సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పాటించడం , ఎరువుల వినియోగం తగ్గించి సహజ వ్యవసాయం వైపు మళ్లడం వంటి చర్యలు దేశ ఆర్థిక భద్రతకు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులను కేవలం ప్రధాని బాధ్యతగా కాకుండా, ఒక జాతీయ ఉద్యమంలా పారిశ్రామికవేత్తలు , ప్రజలు స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు , క్లీన్ ఎనర్జీ యుగంలో ఉందని, వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందని చంద్రబాబు వివరించారు. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన స్వర్గధామమని ఆయన పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై పడకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ, పెట్టుబడులను ఆకర్షించడంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పద్ధతిని తమ ప్రభుత్వం అనుసరిస్తోందని వెల్లడించారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
