ఏపీలో సినిమా టిక్కెట్ వ్యవహారం కొన్ని నెలల క్రితం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్ర్లేదు.ఇప్పుడు టికెట్ వసూళ్ళ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది…సినిమా టికెట్ల అమ్మకాల కోసం ఆన్ లైన్ గేట్ వే తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఇటీవలే సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్ లైన్స్ జారీ చేస్తూ జగన్ సర్కారు ప్రకటన చేసింది.
అన్ని థియేటర్లు మరియు ప్రైవేట్ సంస్థలు ఈ గేట్ వే ద్వారానే సినిమా టికెట్ల విక్రయాలు చేపట్టాలని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు జూన్ 2న ఏపీ సర్కారు జీవో 69ను జారీ చేసింది. నెల రోజుల్లో థియేటర్లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని ఆదేశించింది. టికెట్ల విక్రయించిన తర్వాత థియేటర్లకు డబ్బు ఎన్ని రోజుల్లో జమ చేస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో ఎగ్జిబిటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..టికెట్ వసూళ్లు ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటే ఇబ్బందులు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
ఎంవోయూపై సంతకం పెడితే ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లినట్లే అని ఎగ్జిబిటర్లు,డిస్టిబ్యూటర్స్, థియేటర్స్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే ఒప్పందంపై సంతకాలు చేయడానికి ససేమిరా అంటున్నారు. అవసరమైతే థియేటర్లను మూసివేసేందుకు కూడా వెనుకాడేది లేదని…టికెట్ డబ్బులు ప్రభుత్వ ఖాతాల్లో కాకుండా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో కానీ,పాత పద్దతిలో కానీ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్న 2 పర్సెంట్ కమిషన్ తీసుకున్న కూడా ఏపీలో సినిమా రంగం బాగా దెబ్బ తింటుందని… ఏ కారణం వల్ల సినిమా ఆగిన ఏదైనా కూడా సినిమా డబ్బులు వెంటనే ఇవ్వకపోతే హాళ్ళు పగల కొడతారు దానికి ప్రభుత్వం బాధ్యత తీస్కుంటుందా అన్నారు. అనుభవం లేని జీవోల వల్ల ఇలా అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
జులై 2 లోపు ఎంవోయూ లపై సంతకం చేయకపోతే లైసెన్స్ లు రద్దు చేస్తామని అధికారులు తెలిపిన నేపథ్యంలో.. ఎగ్జిబిటర్ల ఆందోళనను అభ్యంతరాలను తెలియజేస్తూ ఏపీ సీఎంఓకు ఫిలిం ఛాంబర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకొస్తూ 2021 డిసెంబర్ 17న ప్రభుత్వం జీవో నెం. 142 జారీ చేసింది.టికెట్ ధరల నియంత్రణతో పాటుగా బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెట్టడానికే ఈ గేట్ వే ను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పారదర్శకతతో కూడిన ధరలను అమలు చేస్తామని.. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లో అమలు చేయాలని పేర్కొన్నారు. కానీ ఇందులో కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం అని ప్రభుత్వ తీరుపై ఏపీ ఫిలిం ఛాంబర్ సభ్యులు మండిపడుతున్నారు. ఎన్ని సార్లు చర్చలు పెట్టినా ఉన్న సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దానివల్ల సినిమా హాళ్ళు మూసుకోవటం తప్ప ప్రయోజనం లేదని ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.