Site icon NTV Telugu

CM Chandrababu: కుప్పంకు కృష్ణమ్మ.. సీఎం చంద్రబాబు జలహారతి

Babu

Babu

CM Chandrababu: కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ – నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు.. ఏకంగా శ్రీశైలం నుంచి 738 కిలో మీటర్లు ప్రయాణించి కుప్పంలో బీడు భూములను తడుపుతోంది కృష్ణా నది.. పంచెకట్టుకుని సంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు పసుపు, కుంకమ సమర్పంచి జలహారతి ఇచ్చారు.. ఈ జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.. తమ నియోజకవర్గానికి కృష్ణా జలాలు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. జై చంద్రబాబు… జైజై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కుప్పం ప్రజలు..

Read Also: Indian Railways: సికింద్రాబాద్ – నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్దరణ.. కొనసాగుతున్న రైళ్ల రాకపోకలు

ఇక, కుప్పంలో స్త్రీ శక్తి బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు .. మహిళలు, రైతులతో కలిసి బస్సులో ప్రయాణించారు.. కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు మహిళలు, రైతులతో సంభాషిస్తూ బస్సులో ప్రయాణం చేశారు ఏపీ సీఎం.. స్త్రీ శక్తి పేరుతో అందిస్తున్న ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు.. తాము ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది లేకుండా… ఫ్రీ బస్సులో వెళ్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు మహిళలు.. చక్కటి సదుపాయాన్ని కల్పించారని.. తమకు డబ్బులు ఆదా అవుతున్నాయని సీఎంతో చెప్పారు.. హంద్రీ – నీవా ద్వారా కృష్ణా నీళ్లు తొలిసారి కుప్పానికి వచ్చాయి.. కాల్వల్లో నీళ్లు చూశారా..? చెరువులు నిండాయా అంటూ చంద్రబాబు ఆరా తీశారు.. తొలిసారి కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని… చాలా సంతోషంగా ఉందని రైతులు, మహిళలు సీఎం చంద్రబాబు తెలియజేశారు..

Exit mobile version