గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి అరవింద్‌బాబుపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవింద్‍బాబు, ఇతర నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనమన్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారని నిలదీశారు. అస్వస్థతకు గురైన టీడీపీ నేతలను తరలించే అంబులెన్సు పైనా దాడికి దిగడం వైసీపీ ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఘర్షణకు కారణమైన వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read Also: టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబుపై పోలీసుల దాడి
కాగా అనంతరం చదలవాడ అరవింద్‌బాబు కుటుంబసభ్యులకు చంద్రబాబు ఫోన్ చేశారు. చదలవాడ సతీమణి సుధా రాజేశ్వరికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చదలవాడ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా కల్పించారు. కాగా ఇప్పటికే ఈ ఘటనపై టీడీపీ బృందం రాష్ట్ర లీగల్ సెల్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. పోలీసులపై కేసు నమోదు చేయాలని టీడీపీ లీగల్ సెల్ డిమాండ్ చేసింది.