టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఈ-పేపర్‌ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టిక్కెట్ల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అనవసరంగా సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని… టీడీపీకి సినిమా పరిశ్రమ సహకరించిన దాఖలాలు లేవన్నారు. సీఎంగా ఉన్నప్పుడు, ఇటీవల తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీ పెట్టకముందు… ఆ తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని… కానీ 2009లో చిరంజీవి తనకు సహకరించి ఉంటే అప్పుడు తాము అధికారంలోకి వచ్చేవాళ్లమని చంద్రబాబు తెలిపారు.
Read Also: కాటన్ బ్యారేజీ ప్రమాదంలో పడిందా?
అటు ప్రజలు వార్తలు చదివే విధానంలో చాలా మార్పులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ప్రజల అభిరుచి మేరకే రీజనల్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలని భావించే ప్రతిఒక్కరూ టీడీపీ ఈ-పేపర్ చదవాలని సూచించారు. ఇండిపెండెంట్‌గా వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలపై వేటు వేసేందుకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని… జగన్ పుట్టకముందు నుంచి ఉన్న దినపత్రికలపై కులముద్ర వేసేందుకు ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపై ఎల్లో మీడియా అని ముద్ర వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
