ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే వాలంటీర్లకు సన్మానం పేరుతో రూ.233 కోట్లతో తగలేస్తూ పండగ చేసుకుంటున్న ముఖ్యమంత్రిని నీరో అనక ఇంకేమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ కోతలతో ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ హయాంలో మిగులు విద్యుత్‌తో వెలుగులు నిండిన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని చంద్రబాబు నిలదీశారు. భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కడుతున్నా ఈ కోతలు ఎందుకు అని మండిపడ్డారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్ లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారు?(1/3) pic.twitter.com/yQW24jmnaz
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2022
మరోవైపు ఏపీలో వాలంటీర్లు ఏం ఘనకార్యాలు చేశారని సేవా సత్కారాలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. అధికార పార్టీకి సేవలందించినందుకు ప్రజల సొమ్ము దోచిపెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తల సన్మానానికి ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకు, దొంగ మద్యం అమ్మినందుకు సన్మానిస్తున్నారా అని ఆయన నిలదీశారు.