CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..

  • అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
  • ప్రజా వేదికలో సీఎం కీలక ప్రసంగం
  • విజయనగరంలో పార్టీ నేతలతో భేటీ
  • విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరు
Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు అనకాపల్లి, విజయనగరం , విశాఖపట్నం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు , అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం నుంచి అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రతిష్ఠను చాటడం వరకు ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అనకాపల్లి జిల్లాలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ , ప్రజా వేదిక

ముఖ్యమంత్రి పర్యటన వివరాల ప్రకారం, ఆయన శనివారం ఉదయం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అనంతరం ఏ.కొడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ‘ప్రజా వేదిక’ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం 1:15 గంటల వరకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 2:20 గంటలకు పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు.

విజయనగరం పర్యటన.. ఆపై విశాఖలో ‘బ్రిక్స్’ అంతర్జాతీయ సదస్సు..

అనకాపల్లి జిల్లా పర్యటనను ముగించుకుని, ముఖ్యమంత్రి విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్తారు. సాయంత్రం 4:20 గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే కె.లలితకుమారి నివాసానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరుతారు. విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో సాయంత్రం 5:05 గంటలకు ప్రారంభమయ్యే ‘రెండో బ్రిక్స్ (BRICS) యువజన, క్రీడల మంత్రుల సమావేశం–2026’కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సు కార్యక్రమాలు ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాత్రికి తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఒకే రోజులో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు , అంతర్జాతీయ దౌత్య పరిణామాలను సమన్వయం చేస్తూ సీఎం సాగిస్తున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.