ఏపీలో మద్యం బ్రాండ్లపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ సారా అరికట్టాలి.. రాష్ట్రంలో జె బ్రాండ్స్ మద్యం నిషేధించాలి అనే డిమాండ్‌తో రేపు ఎల్లుండి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. మద్యం పై ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నేతలు, క్యాడర్ నిలదీయాలి. సీఎం జగన్ ధన దాహంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు.
దేశంలో లేని మద్యం బ్రాండ్లు ఏపీలో ఎందుకున్నాయి..? అధికారంలోకి వస్తే మద్య నిషేదం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్.. సొంత బ్రాండ్లతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. జగన్ తెచ్చిన కొత్త బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబుల నుంచి రూ. 5 వేల కోట్లు కాజేస్తున్నారు. 5 ఏళ్లలో ఒక్క మద్యం ద్వారానే కమిషన్ల రూపంలో జగన్ 25-30 వేల కోట్లు దోచేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ది అసత్యాల ప్రయాణం.. ఇప్పుడు అన్నీ బయట పడుతున్నాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా ప్రమోషన్ అనేది జగన్ చేసిన తప్పుడు ప్రచారం అని తేలిపోయిందన్నారు చంద్రబాబు.