నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఎస్ఈసీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడంలో అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు… డాక్యుమెంట్లను తారుమారు చేసేందుకే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం లేదనే అనుమానాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. ఫోర్జరీ సంతకాలతో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నట్టు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని ఎస్ఈసీకి తన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో అక్రమాలను నివారించేలా తక్షణం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్త చేశారు.
మరోవైపు.. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. దౌర్జన్యాలు.. దురాగతాలు చేస్తున్నారంటూ ఆరోపించారు చంద్రబాబు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో ఇప్పటి వరకు పోటీలో ఉన్న అభ్యర్థులెవరో ఎందుకు ప్రకటించడం లేదు..? అని ప్రెస్‌మీట్‌లో నిలదీసిన ఆయన.. ఎస్ఈసీ ఏం చేస్తున్నారు..? కలెక్టర్ ఏం చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు.. దినేష్ కుమార్ అనే అధికారి వైసీపీకి అనుకూలంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. నెల్లూరు కార్పోరేషన్ పరిధిలో మొత్తంగా 8 డివిజన్లు ఏకగ్రీవం అని ఏకపక్షంగా ప్రకటించేశారని విమర్శించారు.. అభ్యర్థుల జాబితాను ప్రకటించకుండా.. ఏకగ్రీవాలను ప్రకటించేస్తారా..? ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరిస్తారూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చండి.. ఆ తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని.. వైసీపీకి పోటీ చేసే అర్హతే లేదని కామెంట్ చేశారు చంద్రబాబు.