Chandra Babu Fires on YCP Leaders: ఆంధ్రప్రదేశ్‌ను ప్రతిపక్షాలు శ్రీలంకతో పోల్చడంపై వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులే ఏపీలో ఉన్నాయని.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని, తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకునే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని చంద్రబాబు వివరించారు. పదవీ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్నారు.
Read Also: Hyderabad Cyber Crimes: పార్సిల్ పేరుతో డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
ఏపీ ప్రభుత్వ నేతలు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ కొత్త అప్పులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మూలధన వ్యయం లేదని.. రాష్ట్రంలో రహదారులు దారుణంగా తయారయ్యాయని.. అటు రహదారులకు మరమ్మతులు లేవని విమర్శించారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కావా అని వైసీపీ నేతలను చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందని.. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీలో డయేరియా ప్రబలిన తెంపల్లి గ్రామాన్ని గురువారం నాడు టీడీపీ బృందం సందర్శించనుంది. గద్దె రామ్మోహన్, కొనకళ్ల నారాయణ, బుద్దా వెంకన్న, బోండా ఉమతో కూడిన టీడీపీ బృందం తెంపల్లి గ్రామంలో పర్యటించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెంపల్లిని టీడీపీ నేతలు సందర్శించనున్నారు.