Site icon NTV Telugu

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు..

Ys Bhaskar Reddy

Ys Bhaskar Reddy

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దూకుడు పెంచింది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు మారింది వైఎస్‌ వివేకా హత్య కేసుతో.. ఆ తర్వాత హైదరాబాద్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ఓవైపు.. దర్యాప్తులో ఇంకో వైపు.. ఇలా దూకుడు చూపిస్తోంది సీబీఐ.. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి తాజాగా మరోసారి నోటీసు జారీ చేశారు సీబీఐ అధికారులు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు.

Read Also: Janasena: సభ్యత్వ నమోదు గడువు పొడిగించిన జనసేన

ఫిబ్రవరి 28వ తేదీ అంటే మంగళవారం సాయంత్రం పులివెందులలోని వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ సిబ్బంది.. ఆయనకు నోటీసులు అందజేశారు.. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో లేదా హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని తన నోటీసుల్లో పేర్కొంది సీబీఐ.. అయితే, గత నెల 18వ తేదీన తొలి సారి వైఎస్‌ భాస్కర్ రెడ్డికి నోటీసు ఇచ్చింది సీబీఐ.. 23వ తేదీన విచారణకు రావాలని పేర్కొంది. కానీ, ముందస్తు కార్యక్రమాలతో గత నెల 23న విచారణకు రాలేనని సీబీఐకి సమాచారం ఇచ్చారు భాస్కర్ రెడ్డి.. ఈ నేపథ్యంలో మరో సారి సీబీఐ నోటీసులు ఇచ్చింది.. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కాగా, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ రెండు సార్లు ప్రశ్నించింది.. రెండోసారి విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. నిజాన్ని లక్ష్యంగా చేసుకుని విచారణ చేయకుండా.. వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ చేస్తున్నారని ఆరోపించారు.. ‘100’గా ఉన్న నిజాన్ని ‘0’గా చూపించే ప్రయత్నం.. ‘0’గా ఉన్న అబద్ధాన్ని 100గా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన విషయం విదితమే.

Exit mobile version