Site icon NTV Telugu

Byreddy Siddhartha Reddy : చిన్న బాబు దెబ్బకి పెద్దబాబు బలి కాబోతున్నాడు

Byreddy

Byreddy

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజ్‌ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు. “జగన్ ఏ మంచి కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఒక్కరోజైనా అభినందించాడా? రాష్ట్రంలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే తెలుగుకి అన్యాయం అంటాడు. మేము 17 మెడికల్‌ కాలేజీలు శాంక్షన్‌ చేయించుకున్నాం, కానీ అవన్నీ పూర్తయ్యే దశలో ఉన్నా కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది,” అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు.

వైఎస్సార్‌సీపీ ఇమేజ్‌ను డామేజ్‌ చేయడం తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కూటమికి లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. “85% పనులు పూర్తైన మెడికల్‌ కాలేజీలను చూపకుండా 15% మాత్రమే చూపించి ఏదో జరిగిపోయిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని తెలిపారు. “ఇప్పుడు తమకంటూ సొంత డిస్టిలరీలు పెట్టుకుని మద్యం తయారు చేస్తే తప్పు కాదని చెబుతున్నారు. తెలుగు దేశం నాయకులు గ్రామాల నుంచి మండలాల వరకు మద్యం సరఫరా చేసి దానిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు,” అని మండిపడ్డారు.

వరదలు వస్తే ప్రజలు బాధపడతారని, కానీ కూటమి నేతలు మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్కామ్‌ చేసే ఆలోచనతో సంతోషపడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఈ కూటమి ప్రభుత్వం గ్రాఫ్‌ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పడిపోతుంది,” అని అన్నారు. “చిన్న బాబు దెబ్బకి పెద్ద బాబు బలి కాబోతున్నాడు,” అంటూ సిద్ధార్థ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే, “జనార్దన్‌ రావు కాల్‌ డేటా ఎందుకు తీయడం లేదు? తీస్తే తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీల గుట్టు బయటపడుతుంది. వారికి సంబంధం లేదని రుజువు చేస్తే మేము రాజకీయాలు వదులుకుంటాం,” అని సవాల్‌ విసిరారు. “అన్యాయంగా కేసుల్లో పెడితే ప్రజల్లో సింపతి వస్తుంది. ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు.. జాక్‌పాట్ కొట్టినట్లే,” అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.

Murder : జగద్గిరిగుట్టలో రౌడీషీటర్‌పై దారుణ హత్య.. ఛేదించిన పోలీసులు

Exit mobile version