NTV Telugu Site icon

Byreddy Siddarth Reddy: పవన్ కళ్యాణ్ ‘రంగం’ సినిమాలో విలన్ లాంటోడు

Byreddy Siddarth Reddy

Byreddy Siddarth Reddy

Byreddy Siddarth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏంచేస్తుందో చూద్దాం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో జగన్ ప్రవేశిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయన్నారు. జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయని బైరెడ్డి అన్నారు. ఆ దృష్టితోనే తాను జగన్‌కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించానని.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారని.. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో, ఏం పొడుస్తారో తెలియదు కానీ… జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Fact Check: ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని ప్రచారం.. ఖండించిన ఏపీ పౌరసరఫరాల శాఖ

పవన్ కళ్యాణ్ రంగం సినిమాలో విలన్ లాంటోడని బైరెడ్డి అన్నారు. ఈ సినిమాలో విలన్ బయటికేమో ఉద్యమం అంటాడని, పోరాటం అంటాడని.. లోపలేమో ఉగ్రవాదులతో పొత్తుపెట్టుకుని ఉంటాడని.. పవన్ కూడా అంతేనని వివరించారు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు, పేద ప్రజలను మోసం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని.. అలాంటి వ్యక్తికి పవన్ మద్దతు తెలపాల్సిన అవసరం ఏముందని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ప్రశ్నించారు. అటు ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపైనా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు కనీసం 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా అని ప్రశ్నించారు. హైపర్ ఆది లాంటి వాళ్లు తాము ఎలాంటి నాయకుల కింద పనిచేస్తున్నామో గుర్తించాలని అన్నారు. తమ పార్టీలో ఉన్నప్పుడు పవన్‌ను బూతులు తిట్టి, ఇప్పుడు ఆయన పార్టీలోకి వెళ్లి తమను బూతులు తిట్టేవాళ్లను కూడా చూశామన్నారు. అయితే హైపర్ ఆది లేదా ఆ పార్టీకి చెందిన ఇతర వక్తలను గానీ తప్పుబట్టనని, ఆ పార్టీ నాయకత్వాన్నే తప్పుబడతానని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు.