Site icon NTV Telugu

Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

British Deputy High Commissioner

British Deputy High Commissioner

Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షుణ్ణంగా చర్చించిన అంశాలను సీఎం జగన్‌తో విన్‌ ఓవెన్ పంచుకున్నారు. యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఇక్కడ కూడా అమలు చేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి తాము కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అటు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్‌ బృందానికి సీఎం జగన్ వివరించారు. యూకే- భారత్‌ విద్యార్ధుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ విషయంపై బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ సానుకూలంగా స్పందించారు. ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు బ్రిటీష్‌ బృందం హామీ ఇచ్చింది. మరోవైపు ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటీష్‌ బృందానికి సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపైనా చర్చించారు.

Read Also: Kerala: అదృష్టం అంటే ఈ చేపల వ్యాపారిదే.. బ్యాంకు నోటీసులు, అంతలోనే తగిలిన లాటరీ

వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్ విన్ ఓవెన్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యారంగానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వనున్నట్లు ఓవెన్ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ఈ సమావేశంలో బ్రిటీష్‌ కమిషన్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పొలిటికల్‌ ఎకానమీ అడ్వైజర్‌ నళిని రఘురామన్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Exit mobile version