Site icon NTV Telugu

Botsa Satyanarayana : మూడు రాజధానులు ఏర్పాటు చేసుడే..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధానిపై కలకలం రేగింది. దీంతో ఎంతో మంది రైతులు, తదితరులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకుంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే బిల్లులో కొన్ని సవరణలు చేసి మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతామని వైసీపీ మంత్రులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తాజా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని తెలిపారు. రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కేంద్రం కూడా చెప్పిందన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం అప్పటి విభజన చట్టంలో ఉందని, రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ విషయంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Exit mobile version