ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నేతలు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతి చేశారని మండిపడ్డారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి.. ఆయనే జగన్ లావాదేవీలను దగ్గరుండి చూస్తారని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను సంపాదించారని.. మొత్తంగా మంత్రి పెద్దిరెడ్డి అక్రమార్జన అక్షరాలా రూ. 6889 కోట్లు అని తెలిపారు. శివశక్తి డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొట్టి పెద్దిరెడ్డి రూ.700 కోట్లు దోచారన్నారు. పెద్దిరెడ్డికి చెందిన పల్ప్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి రూ. 190 కోట్లు దోపిడీ చేశారని వివరించారు.
పెద్దిరెడ్డి మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాగా ఏర్పడి భారీ దొపిడీకి తెర లేపారని బోండా ఉమ ఆరోపించారు. త్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ భూ దొపిడీకి కేంద్రం పెద్దిరెడ్డే అన్నారు. వేల ఎకరాలను మాఫియా ద్వారా చేజిక్కించుకుని రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమార్జన చేసిన ఘనత పెద్దిరెడ్డిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారానే పెద్దిరెడ్డి రూ. 1800 కోట్లు వెనకేశారని బోండా ఉమ అన్నారు. అనకొండ పెద్దిరెడ్డి వల్ల శేషాచలం అడవి కూడా మాయమైందన్నారు. పుష్ప సినిమా స్టైల్లో ఎర్రచందనం చెట్లను నరికించి దొపిడీ చేశారన్నారు. అక్రమార్జన ద్వారా ఓట్లను కొనుగోలు చేయాలనేది సీఎం జగన్ వ్యూహమని.. వైసీపీలో అవినీతి అనకొండలు ఎక్కువయ్యారని విమర్శించారు. మంత్రుల అవినీతిపై సీఎం జగన్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ చేస్తే రాజీనామాలు చేసిన మంత్రులంతా జైలుకెళ్లడం ఖాయమన్నారు. మామూలు దొంగలను కెబినెట్ నుంచి తప్పించి.. గజ దొంగలను సీఎం జగన్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారా అనే అనుమానం ఉందన్నారు. ఈ స్థాయిలో దొపిడీ చేసిన పెద్దిరెఢ్డిని కెబినెట్టులో కొనసాగిస్తారా..? లేక తప్పిస్తారా అనేది చూడాలన్నారు. పెద్దిరెడ్డితో జగన్ ఉత్తుత్తి రాజీనామా చేయించారనే ప్రచారమూ ఉందని బోండా ఉమా పేర్కొన్నారు.
https://ntvtelugu.com/payyavula-keshav-comments-on-cm-jagan-language/