తెలుగువారి గర్వకారణమైన చారిత్రక సంగీత వాద్యం బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక “వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాను ప్రతినిధ్యం వహించే ఉత్పత్తిగా బొబ్బిలి వీణను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ODOP అవార్డును జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జూలై 15న న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపం వేదికపై నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు.
బొబ్బిలి వీణ దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా గొప్ప గౌరవాన్ని పొందింది. శాస్త్రీయ సంగీత ప్రదర్శనలలో కీలకమైన ఈ వాద్యాన్ని సరస్వతి వీణ అని కూడా పిలుస్తారు. ఈ వీణ తయారీకి ముఖ్యంగా పనస మరియు సంపంగి చెక్కలను ఉపయోగిస్తారు. వాటితోనే శబ్ద నాణ్యత, ప్రతిధ్వని అద్భుతంగా ఉండేలా తయారీ జరుగుతుంది. ముఖ్యంగా చిన్న బొబ్బిలి గిఫ్ట్ వీణలు ప్రముఖులకు బహుమతులుగా ఇచ్చే సంప్రదాయం ఈ కళా సంపదకు మరింత మాన్యతను తీసుకువచ్చింది.
Malnadu Restaurant : మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి
ఇప్పటికే బొబ్బిలి వీణ అనేక జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను పొందినది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీణను స్వయంగా చూసి అభినందించగా, విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్, జీ-20 సమావేశాల్లో వీణ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా, బొబ్బిలి వీణ చిత్రం ప్రధానంగా ఉన్న పోస్టల్ స్టాంపులు, స్మారక నాణేలు విడుదల కావడం కూడా ఈ కళా సంపదకు దక్కిన గౌరవానికీ నిదర్శనం. వీణలు విదేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో, దీనికి ప్రత్యేక మార్కెట్ కూడా ఏర్పడింది.
బొబ్బిలి వీణ తయారీ ప్రధానంగా బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో కొనసాగుతోంది. ఈ గ్రామంలోని అనేక కుటుంబాలు తరతరాలుగా వీణ శిల్పకళలో నిపుణులుగా కొనసాగుతున్నాయి. వీరి జీవనాధారంగా నిలిచిన ఈ కళా సంపదకు పనస కలప కొరత ఉన్న సమయంలో ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనస చెట్ల సాగును ప్రోత్సహించి, కీలక భూమిక పోషించింది. ఇది ఈ వృత్తిని నిలబెట్టేందుకు, తరతరాలుగా కళాకారుల జీవితాలకు మద్దతుగా మారింది.
ప్రస్తుతం బొబ్బిలి వీణకు లభించిన ODOP గుర్తింపు ఈ కళకు మరింత దేశవ్యాప్త గుర్తింపును తీసుకురానుంది. ఇది నాటి రాజుల ఆశ్రయాన్ని పొందిన సంగీత వాద్యాన్ని, నేటి యువతకి అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు చేరువ చేయడంలో కీలకంగా మారనుంది. ఒక జిల్లా, ఒక ఉత్పత్తి అనే ఆధారంగా, ఈ విశిష్టమైన కళా సంపద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అంగీకారాన్ని పొందడంతో, ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేసింది.
Mahavatar Narasimha: హోంబాలే ‘మహావతార్ నరసింహ’ తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్