GVL NarasimhaRao: విశాఖలో భూకబ్జాలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు వైసీపీ, టీడీపీలకు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాలపై వైసీపీ, టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. త్వరలోనే బహిరంగ చర్చకు పిలుస్తామని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంటే వైసీపీ, టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నాయని.. పోలవరం నిర్మాణం ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వం చేతకానితనం కారణమని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులిస్తే ప్రాజెక్ట్ ప్రారంభించిన చంద్రబాబు కమిషన్ల కోసం పోలవరం తీసుకున్నారని.. 14ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రాలేదని ఆరోపించారు.
విశాఖ భూ దోపిడీలో టీడీపీ, వైసీపీ తోడు దొంగలు అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. రెండు సిట్‌లు ఏర్పాటు చేసినా ఎందుకు నివేదికలు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రబాబు మధ్య ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భూదోపిడీలో వైసీపీ, టీడీపీ భాగస్వాములు అయ్యాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైజాగ్ భూ స్కాంపై ప్రస్తావించి దేశం మొత్తం తెలిసే విధంగా చేస్తామన్నారు. గతంలో భూ స్కాంలపై మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలన్నారు. గతంలో భూముల గురించి మాట్లాడి ఇప్పుడు మౌనం పాటిస్తున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధిని అనుమానించాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి విశాఖలో 5జీ సేవలు ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. విశాఖ నుంచి మూడు వందే భారత్ రైళ్లు నడపించాలని కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టామని జీవీఎల్ తెలిపారు.
Read Also: Tirumala: శ్రీవారికి కాసులే కాసులు.. వరుసగా 9వ నెల కూడా రికార్డు..!!
అటు విశాఖలో ఇటీవల ప్రధాని మోదీ పర్యటనకు అయిన ఖర్చులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఖర్చు పెట్టిందని.. సభ నిర్వహణ మొత్తం తామే చేశామని ఎవరైనా ప్రచారం చేసుకుంటే దుస్సాహసమే అవుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. జనసేన, బీజేపీ భాగస్వామ్యం కంఫర్టబుల్‌గా ఉందని తెలిపారు. తమ పొత్తును చూసి మిగిలిన రాజకీయపార్టీల్లో గుబులు పట్టుకుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తరచూ బీజేపీ ముఖ్యులతో సమావేశం అవుతూనే ఉన్నారని జీవీఎల్ పేర్కొన్నారు.