GVL Narasimha Rao: ఈసారి మాకు అవకాశం ఇస్తే.. సమస్యలను ప్రధాన మంత్రికి చూపించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యం.. అందుకే మా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం వలసలు వెళ్లిపోతున్నారన్న ఆయన.. ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలు ఇక్కడ సమస్యల పై పార్లమెంటులో గానీ.. సంబంధిత మంత్రులను గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. దీనిపై ఎన్నికల తరువాత బహిరంగ చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు జీవీఎల్.
అపారమైన వనరులు ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు ఎంపీ జీవీఎల్.. పెద్దపెద్ద నాయకులు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గతంలో అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవడంతో ఈ ప్రాంతం తమకు కంచుకోటగా చెప్పుకుంటుందని.. ఇక, వేవ్‌లో గెలిపొందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు కంచుకోటగా చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు.. అయితే, మాకు ఇక్కడ ఒక్క సీటు కూడా లేదు.. కానీ, ఈసారి అవకాశం ఇస్తే దీనిని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారు.. ఇది దురదృష్టకరం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
