Site icon NTV Telugu

Amaravati : మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే రాజధాని..!

Cm Ramesh

Cm Ramesh

ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 19 నుంచి బీజేపీ ప్రజా పోరు ప్రారంభం అవుతుందన్నారు.. రాష్ట్రంలో 5 వేల చోట్ల సభలు నిర్వహిస్తామన్నారు. ఇక, అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసింది లేదు.. అభివృద్ధి లేదు, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు సీఎం రమేష్‌.. ఇసుక అక్రమ వ్యవహారంలో ఎమ్మెల్యేలే వసూలు చేస్తున్నారని విమర్శించారు.. మట్కా, గుట్కా అక్రమ వ్యాపారం పోలీసుల సహకారంతో నేతలే చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు..

Read Also: Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదు

నిరహార దీక్ష చేస్తే.. కడప ఉక్కును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు అతీ గతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రమేష్.. గండి కోటకు నీళ్ళు తెచ్చినా పంట పొలాలకు ఇవ్వడానికి సాగు నీటి కాలువలు లేవన్న ఆయన.. రైతుల పంటలకు బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు.. కనీస మద్దతు ధర లేదని విమర్శించారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చ గొట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. అభివృద్ధి ఎక్కడా లేదు.. పాదయాత్రలో చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు. అమరావతికి మోడీ శంకు స్థాపన చేశారు.. ముమ్మాటికీ అదే రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు.

పాదయాత్రలో అల్లర్లు సృష్టించి, బీభత్సం చేస్తే అది బీజేపీపై చేసినట్లే భావించాల్సి ఉంటుందన్నారు సీఎం రమేష్.. ఇక, నవంబర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఏపీలో ఉంటుందని వెల్లడించారు.. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. విజయవాడలో ప్లై ఓవర్ నేషనల్ హైవే అథారిటీ క్రింద కేంద్ర నిధులతో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పడం సిగ్గు చేటని ఫైర్‌ అయ్యారు.. ఏపీలో ఒక్కటి చేశామని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా..? అంటూ సవాల్‌ చేశారు. ఏమీ చేయలేక అసెంబ్లీలో అధికార పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని ఆరోపణలు గుప్పించారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌.

Exit mobile version