ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తు పొడుపులు పొడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఈమధ్యే మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి 1) జనసేన+బీజేపీ పొత్తు, 2) జనసేన+టీడీపీ+బీజేపీ పొత్తు, 3) జనసేన ఒంటరిగా పోటీ చేయడం. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు రెండురోజులుగా ఏపీలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
జేపీ నడ్డాతో జరిపిన కోర్ కమిటీ భేటీలో పౌత్తుల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులపై రాష్ట్ర నేతలెవ్వరూ నోరు మెదపొద్దని నడ్డా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి దూరం.. ఈ పార్టీకి దూరం అనే తరహా కామెంట్లు కూడా వినిపించకూడదని స్పష్టీకరించారు. పొత్తులపై మాట్లాడొద్దని అమిత్ షా స్పష్టం చేశాక కూడా ఇంకా ఆ ప్రస్తావన ఎందుకు వస్తోందని నేతలను ప్రశ్నించారు నడ్డా.
పవన్ ఇచ్చిన ఆప్షన్లను.. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్లను పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు నడ్డా. పవన్ తమతో టచ్ లో ఉన్నారని.. తన ఆలోచనలను ఎప్పటికప్పుడు తమతో పంచుకుంటున్నారని నడ్డా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది పార్టీ హైకమాండ్ పరిధిలో అంశమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నడ్డా స్పష్టీకరించారు.
మిగిలిన విషయాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని నడ్డా నేతలకు సూచించినట్టు తెలుస్తోంది. ఏపీపై బీజేపీకి ఫోకస్ ఉంది.. పక్కా ప్రణాళికా ఉందన్నారు బీజేపీ బాస్ నడ్డా. 18 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చిన హైకమాండుకు ఏపీని ఎలా డీల్ చేయాలో తెలీదనుకుంటున్నారా..? అంటూ ప్రశ్నించారు నడ్డా. మరి, బీజేపీ బాస్ ఆదేశాలను బీజేపీ నేతలు ఎలా పాటిస్తారో చూడాలి మరి.
Cricket: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు హాజరుకండి.. జగన్‌కు ఏసీఏ ఆహ్వానం