ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యామ్నాయం తామేనంటూ చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలో పదవలు నుంచి నేతల తొలగింపు, రాజీనామా పర్వం కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది.. దానిపై ఆ పార్టీ నేతలే స్వయంగా మీడియా ముందుకు రావడం చర్చగా మారింది.. అయితే, మా పార్టీలో ఎవరూ రాజీనామాలు చేయలేదు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలకు ఒక డేట్ లేకుండా చేసిందని ఆరోపించారు.. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదు. ఐదు నెలలుగా ఎప్పుడు జీతాలు ఇస్తామో ప్రభుత్వానికే తెలియని పరిస్థితి ఉందన్నారు. ఈ నెలలో సంక్రాంతి పండుగ ఉన్నందున్న జీతాలు ఆలస్యంగా ఇస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడతారు.. ప్రభుత్వం స్పందించి జీతాలు, పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Bonda Uma: కందుకూరు, గుంటూరు ఘటనలపై సీబీఐ ఎంక్వయిరీ వేయండి..
ఇక, రైతులు ధాన్యానికి కూడా యాభై శాతం చెల్లింపులు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు సూర్యనారాయణరాజు.. ఉపాధ్యాయుల బదిలీ విద్యా సంవత్సరం ఆరంభంలో చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం పరీక్షల సమయంలో బదిలీలు చేయడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.. జీవోలు ప్రజల కోసమంటారు.. ప్రజలకు చూపించరు అని ఎద్దేవా చేశారు.. మరోవైపు.. స్పీకర్ ఏకంగా తొడ గొడతారు.. ఛాలెంజీలు చేస్తారని మండిపడ్డారు.. స్పీకర్‌గా ఆ పదవికి హుందాతనం తేవాలి అని హితవుపలికారు. రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు పెరిగాయి. దౌర్జన్యం చేసిన వారిని వదిలేసి.. బాధితులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.. ఇసుక మాఫియాపై బీజేపీ ప్రశ్నిస్తే స్పందించరు.. ఏపీలో ఇసుక, మద్యం, భూ మాఫియాలతో మాఫియా ప్రభుత్వంగా పేరు గడించారని విమర్శలు గుప్పించారు. జగన్‌కి ముందు చూపు లేని కారణంగా రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయ్యిందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు.
