NTV Telugu Site icon

Bhuma Akhila Priya: ఇక్కడ బతకడం కంటే.. పక్క రాష్ట్రాల్లో చిన్న వ్యాపారం చేసుకుని బతకొచ్చు అనే పరిస్థితి వచ్చింది..!

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీలో బతకడం కన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకోచ్చు అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపణలు గుప్పించారు.. వైసీపీ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చారు.. తీరా, అధికారం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాల్ని విడదీసి, ప్రజల్ని రెచ్చగొట్టి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేవు అని దుయ్యబట్టారు. పెన్షన్లు పెంచుతామని ఏదో కారణం చెప్పి ఉన్న పెన్షన్లు పీకేయడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలపై దాడులు ఎక్కువ అవుతున్నాయని డీజీపీ చెప్పారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు అన్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసే పాదయాత్రలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.

Show comments