ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. మార్చి తొలివారంలో టిక్కెట్ రేట్లపై కొత్త జీవో అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజే విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్ రేట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా, అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే రెవెన్యూ అధికారులు థియేటర్ల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు.
దీంతో కృష్ణా జిల్లా మైలవరంలో భీమ్లానాయక్ ప్రదర్శించే థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. తగ్గించిన టిక్కెట్ ధరలతో భీమ్లానాయక్ సినిమా తమకు గిట్టుబాటు కాదని సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గేటు బయట నోటీసు అతికించడంతో సినిమా కోసం వచ్చిన పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అటు ప్రకాశం జిల్లా ఇంకొల్లులోనూ భీమ్లానాయక్ సినిమా ప్రదర్శన నిలిపివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.