కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. వరంగల్ జిల్లా హనుమకొండలో కార్మికుల నిరసనకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలిపారు. పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.సిద్దిపేట పట్టణంలో కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించాయి కార్మిక సంఘాలు. ఆదిలాబాద్ లో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ముందు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి ఇంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతునే ఉంటాయని అన్నారు.
రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొంటున్నారు సింగరేణి కార్మికులు…సింగరేణి 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువులు ,డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరలు తగ్గించాలని,ఒప్పంద కార్మికులకు 25 వేల రూపాయలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త లేబర్ కోడ్ విధానం ద్వారా కార్మిక హక్కులను హరించవద్దని, 10వ వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలని డిమాండ చేశారు. మణుగూరులో ఆర్టీసి, మున్సిపాల్టీ, సింగరేణిపై సమ్మె ప్రభావం కనిపించింది. సమ్మెలో పాల్గొన్నాయి పలు కార్మిక సంఘాలు. సింగరేణిలో 50 శాతం ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు.
ఏపీలో పలు జిల్లాల్లో సార్వత్రిక సమ్మెలో భాగంగా వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. విజయనగరంలో కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు కార్మికులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్నారు చాడ వెంకట్ రెడ్డి. కోఠి సెంట్రల్ బ్యాంక్ లో బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె చేపట్టారు. సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
