Site icon NTV Telugu

Atchannaidu: జగన్ పాలనలో తీవ్ర సంక్షోభంలోకి వ్యవసాయ రంగం

Atchannaidu Fires On Jagan

Atchannaidu Fires On Jagan

జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టినప్పటి నుంచి.. ఆంధ్ర రాజకీయాలు వ్యవసాయ రంగం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, టీడీపీ పార్టీలు సైతం.. ఈ సందర్భంగా కార్యక్రమాలు, కమిటీల్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా టీడీపీ ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట ఓ కమిటీని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ మూడేళ్ళ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.

పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము రాష్ట్రంలోని అన్నదాతల్ని ఆదుకోవడానికి టీడీపీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం పేరుతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు న్యాయం జరిగే పోరాడుతుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

కాగా.. ఈ క‌మిటీలో స‌భ్యులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి, కాల‌వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, న‌ల్లమిల్లి రామ‌కృష్ణారెడ్డి, బీసీ జ‌నార్దన్ రెడ్డి, కూన ర‌వికుమార్‌, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాస‌రెడ్డిలను నియ‌మించారు.

Exit mobile version