ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసని ప్రభావంతో కోస్తా తీరం అల్లకల్లోలంగా మారింది. భయంకరమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలి చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
అసని తుఫాన్ మీద సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలని.. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సూచించారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని.. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అన్నారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని, అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని, తుపాను బాధితులకు ఏమైనా కష్టమొస్తే వెంటనే ఆదుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు.
నరసాపురం దగ్గర తీరంను ఆనుకుని పయనిస్తున్న ‘అసని’ తుఫాన్.. తీరం సమీపానికి వచ్చాక వేగం తగ్గింది. ప్రస్తుతం గంటకు 3కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, నర్సాపురంకు 50కి.మీ దూరంలో తుఫాన్ కొనసాగుతోంది. విశాఖ దగ్గర మరోసారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి, తుఫాన్ బలహీనపడింది. ప్రస్తుతం తీరంలో తీవ్ర గాలులు సాగుతున్నాయి. బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆరు మండలాలలో అసని తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. జిల్లాలో 30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. లోతట్టు ప్రాంతాలలో వారిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో అలలు తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో రెండు కిలో మీటర్ల మేర రోడ్డు పూర్తిగా బ్లాక్ చేశాం.
నర్సాపురం దగ్గర తీరాన్ని తాకి ఉత్తర ఈశాన్య దిశగా అసని తుఫాన్ పయనిస్తోంది. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో తుఫాన్ ప్రయాణిస్తోంది. కాకినాడ నుంచి విశాఖ మీదుగా మళ్లీ సముద్రంలోకి వెళ్లి విశాఖ దగ్గర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి క్రమంగా బలహీనపడనుంది. తుఫాన్ కారణంగా విశాఖ నుంచి గుంటూరు తీరం వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.
ఏపీలోని కోస్తా జిల్లాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలపై అసని తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. తుఫాన్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరం. ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలి.
అసని తుఫాన్ బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. తుఫాన్ బాధితులకు రూ.2 వేలు పరిహారం చెల్లించాలని అదేశించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. సెంట్రల్ హెల్ప్ లైన్‌తోపాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్లకు బాగా ప్రచారం కల్పించి వాటికి వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించాలని హితవు పలికారు.
అసని తుఫాన్ ప్రభావంతో ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం పోర్టులలో అధికారులు 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టులలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అసని తుఫాన్ ప్రభావంతో విశాఖ, విజయవాడ, రాజమండ్రికి విమాన సర్వీసులు రద్దయ్యాయి. 22 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించగా.. ఎయిర్ ఏషియా కూడా విమాన సర్వీసులను రద్దు చేశాయి. అయితే విమాన సర్వీసుల కొనసాగింపు లేదా రద్దుపై ఎయిరిండియా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అసని తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వర్చువల్‌గా సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.