అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ‘అర్నాబ్’ తీవ్ర తుఫాన్ వల్ల రాష్ట్రంలో సంభవించిన తీవ్ర నష్టంతో పాటు సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అర్నాబ్ తుఫాన్ కారణంగా ప్రాథమికంగా రూ.4,563 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం వాటిల్లిందని సీఎం కేబినెట్‌కు వివరించారు. నష్ట తీవ్రతను స్వయంగా అంచనా వేసేందుకు రేపు కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తుఫాన్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కేబినెట్ సమావేశం సంతాపం ప్రకటించింది.
రైతుల ఖాతాల్లోకి రూ.6 వేల సాయం..
తుఫాన్ కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.2,000తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4,000 కలిపి మొత్తం రూ.6,000ల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.3,120 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ధైర్యం చెప్పేందుకు స్వయంగా పర్యటించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ రోజు, రేపు ఉభయ గోదావరితో పాటు ఇతర జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం తెలపగా.. రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
సీఎం చొరవతోనే తగ్గిన ప్రాణ, ఆస్తి నష్టం: పవన్ కళ్యాణ్ ప్రశంసలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లే అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చూపిన చొరవ, ముందస్తు జాగ్రత్తల వల్లే రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గిందని, సంక్షోభ సమయంలో ఆయన స్పందించిన తీరు ప్రశంసనీయమని పవన్ కొనియాడారు.
తుఫాన్లు, ఫ్యాక్షన్లపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
గతంలో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, కానీ సాంకేతికత, అప్రమత్తతతో ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడుకునే స్థాయికి చేరుకున్నామని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వారసత్వంగా రాయలసీమలో ఫ్యాక్షనిజం, కోస్తాలో తుఫాన్లు అనే రెండు ప్రధాన సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను పూర్తిగా నిర్మూలించి అక్కడ ఉద్యాన పంటలు పండించేలా చేశామని, అలాగే కోస్తాలో తరచూ తుఫాన్లు వస్తున్నప్పటికీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. భావి రోజుల్లో ప్రాణ నష్టాన్ని సున్నాకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
ఇదే సమయంలో తుఫాన్ తాకిడికి మత్స్యకారుల పడవలు పూర్తిగా ధ్వంసమయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు కేబినెట్ దృష్టికి తీసుకురాగా.. దెబ్బతిన్న పడవల పరిహారం కోసం కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా తగిన ఆర్థిక సాయం అందిద్దామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

