NTV Telugu Site icon

పండుగ సమయం ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. వాత కూడా..!

పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్‌లో ప్రత్యేక బస్సులను నడపడమే కాదు.. ఈ స్పెషల్ బస్ సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయనున్నారు. అయితే, ఈ సమయంలో.. రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని.. కానీ, దసరా స్పెషల్‌ బస్సుల్లోనే 50 శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామని.. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు ద్వారకా తిరుమలరావు.

మరోవైపు.. వరుసగా పెరిగిపోయిన డీజిల్ ధరలు కూడా ఆర్టీసీపై భారం మోపుతున్నాయని తెలిపారు ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్న ఆయన.. విలీనం తర్వాత కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. నిర్వహణ వ్యయం తగ్గించేందుకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని.. సంస్థపై పడుతోన్న భారం, నష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కానీ, ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.