నేడు ఏపీఐఐసీ ఆవిర్భవించిన రోజు. 49 ఏళ్ళు పూర్తి చేసుకుని 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో ప్రత్యేక ముద్ర వేసుకుంది. 1973 సెప్టెంబర్ 26న రూ.20 కోట్ల మూలధనంతో ఏర్పాటయింది. ఇప్పటి వరకు 450కి పైగా పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 1,25,000 ఎకరాల్లో 3,500కు పైగా యూనిట్ల ఏర్పాటు జరిగింది. విభజన తర్వాత రాష్ట్రంలో 93 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేశారు. రూ.1,708 కోట్ల వ్యయం.. 99,465 మందికి ఉపాధి కలిగింది.
3 పారిశ్రామిక కారిడర్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధిపైనా దృష్టి పెట్టారు. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి మౌలిక వసతుల సంస్థ పాత్ర ప్రత్యేకం. సరికొత్త లక్ష్యాలతో 50వ వసంతంలోకి అడుగుపెడుతోంది ఏపీఐఐసీ. హైదరాబాద్ పురోగతిలో కీలకమైన హైటెక్ సిటీ నుంచి విశాఖలోని రాంకీ ఫార్మా సెజ్ వరకు అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీఐఐసీ బ్రాండ్ కలిగి వుంది. గుంటూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టులను నిర్వహణా ఏపీఐఐసీదే.
రాష్ట్ర ప్రగతిలో కీలకంగా ఉన్న శ్రీ సిటీ, అచ్యుతాపురం, నెల్లూరు మాంబట్టు , గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ సహా అభివృద్ధి చేసింది ఏపీఐఐసీనే. ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించింది. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్లను వేల కోట్లతో అభివృద్ధి చేస్తోంది. ఒక్క విశాఖ – చెన్నై కారిడార్‌లోనే 33,000 ఎకరాలు ఉండగా అందులో తొలుత రూ.5,000 కోట్లతో రూ.10,000 ఎకరాలను ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో అభివృద్ధి చేస్తోంది.
చెన్నై – బెంగళూరు కారిడార్‌లో మొత్తం 12,000 ఎకరాల అభివృద్ధి జరుగుతుంది. ఇందులో తొలుత 2,500 ఎకరాల్లో క్రిస్ సిటీ పేరుతో పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తోంది ఏపీఐఐసీ. హైదరాబాద్ – బెంగళూరు కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద సుమారు 10,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడ అభివృద్ధి జరగనుంది. ఇవి కాకుండా వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 800 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద మెగా ఫుడ్ పార్క్, కాకినాడ సెజ్, తిరుపతి వద్ద ఈఎంసీ 1, ఈఎంసీ 2ల ప్రగతిలో ఏపీఐఐసీ వెన్నెముక అవుతుంది.
చిత్తూరు జిల్లా మన్నవరం వద్ద 225 ఎకారల్లో విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్, కొప్పర్తి వద్ద 1,000 ఎకరాల్లో పీఎం-మిత్రా పథకం కింద టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. విశాఖ, అనంతపురంలలో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. పరిశ్రమలకు ఎంతో కీలకమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కొప్పర్తికి 100 కోట్లతో, ఓర్వకల్లుకు రూ. 280 కోట్లతో ఒక టీఎంసీ నీటిని సరఫరా చేసే పనుల ప్రారంభం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కేవలం పెద్ద పరిశ్రమలకే కాకుండా అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా పార్కుల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, పారదర్శక పారిశ్రామిక విధానం చూసి టాటా, బిర్లా, అదానీ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలన్నారు సీఎం. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి. సీఎం స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తామని ఏపీఐఐసీ ప్రతినిధులు సీఎంకి హామీ ఇచ్చారు. ఈ ఏడాది పాటు నిర్వహించబోయే స్వర్ణోత్సవ వేడుకల వివరాలను సీఎంతో పంచుకున్నారు ఏపీఐఐసీ ప్రతినిధులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండి జేవీఎన్. సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు.