AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.

  • ఏపీలో ఎండల ఎఫెక్ట్.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • పలుచోట్ల తీవ్రమైన వడగాలుల హెచ్చరిక
  • పగలే కాదు.. రాత్రిళ్లు కూడా పెరుగుతున్న వేడి
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
Ap Temperatures

Ap Temperatures

AP Weather Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భానుడు భయపెడుతున్నాడు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 26 వరకు కోస్తాంధ్ర ప్రాంతానికి ప్రచండ ఎండల ముప్పు పొంచి ఉందని, మరో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అతి తీవ్రమైన వడగాలులు (Heat Waves) వీస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యధిక వేడి వాతావరణం నెలకొంటుందని స్పష్టం చేసింది. బాపట్లలో ఈ సీజన్ సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 7.4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది.

ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దక్షిణ కోస్తాలోని 8 జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ (Red Alert) ప్రకటించింది. మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ , ఐఎండీ అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఎలా ఉందంటే.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. కేవలం పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ‘వార్మ్ నైట్స్’ (Warm Nights) సంఖ్య పెరుగుతోందని, రాత్రి పూట కూడా వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రచండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా ద్రవపదార్థాలు తాగాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.