నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అయితే, ఇది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు.. ఏపీలోనూ తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేయడం చర్చగా మారింది.. విశాఖలో కేసీఆర్ చిత్రపటానికి ఏపీ నిరుద్యోగ జేఏసీ పాలాభిషేకం చేసింది… విశాఖ పబ్లిక్ లైబ్రరీ దగ్గర అభినందన సభ కూడా నిర్వహించారు.. ఇక, పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేసిన జేఏసీ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,32,000 ఉద్యోగాలను, 47 వయోపరిమితి హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Parliament Session: ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ..
కాగా, తెలంగాణలో కొలువ జాతరకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.. ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని మంగళవారం వనపర్తి బహిరంగ సభ వేదికగా నిరుద్యోగులకు సూచించిన ఆయన.. ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు.. ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉండగా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని తెలిపిన సీఎం.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నామని.. మిగతా 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక, ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. జోన్ల వారిగా.. జిల్లా వారీగా.. ఇలా తన స్టేట్‌మెంట్లో పూర్తి వివరాలను పొందుపర్చారు సీఎం కేసీఆర్. మొత్తంగా.. తన ప్రకటనతో తెలంగాణ నిరుద్యోగుల నుంచే కాదు.. ఏపీలోని నిరుద్యోగుల నుంచి కూడా పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.