జగన్ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ఇవాళ కూడా సభలో మద్యం పాలసీపై అసత్యాలు చెప్పి జంగారెడ్డిగూడెం మృతుల కుటుంబాలను కించపరిచారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సభలో సీఎంకు వైసీపీ ఎమ్మెల్యేలు చేసే భజన చూడలేకే తమ సభ్యులు చిడతలు వాయించారని తెలిపారు. పాలసీని మార్చి దుకాణాలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 దుకాణాల్లో మద్యం శాంపిల్స్ తీసి న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.
ఏపీలో ప్రజలు తమకు నచ్చిన బ్రాండ్ తాగే రోజులు పోయి ధరల ఆధారంగా మద్యం కొనుగోళ్లు చేస్తున్నారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. తాము సభలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు భయపడి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేవాలయం లాంటి శాసనసభను జగన్ వైసీపీ కార్యాలయంలా మార్చారని ఆరోపించారు. ప్రజలు మద్యం తాగకుండా టీడీపీ కుట్ర పన్నుతోందని సీఎం చెప్పటం దుర్మార్గమన్నారు. ప్రజలు మద్యం తాగటం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలనే సీఎం జగన్ దుర్బుద్ధి మరోసారి బయటపడిందన్నారు. మద్యపాన నిషేధం హామీ ఇవ్వలేదని సీఎం జగన్ చెప్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.
