తెలుగు దేశం పార్టీ నేతలకు సవాల్ విసిరారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న నిరసనలపై ఘాటు విమర్శలు చేశారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగితే కేంద్రాన్ని అడగండి… ఇంట్లో జోడీగానే ఉన్నారుగా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. కేంద్రాన్ని వదిలేసి… మా పై ఏడుస్తారెందుకు? అని ప్రశ్నించారు. 1,261 హామీలిచ్చి నెరవేర్చని మీదా దేవతల పాలన ? అని ప్రశ్నించిన ఆయన.. మోసం, దగా, వంచనతో నయవంచక పాలకులుగా మీరు మిగిలిపోయారన్నారు. జనం బుర్రగొరిగి ఇంటికి పంపించినా మీకు సిగ్గురాలేదు అంటూ ఫైర్ అయ్యారు.
సంక్షేమంపై క్యాలండర్ ప్రకటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు స్పీకర్ తమ్మినేని.. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన.. మనం సైలెంట్ గా ఉన్నాం కాబట్టే టీడీపీ విమర్శలు చేస్తోందన్నారు.. ఇకపై మౌనం వీడాలి… మనల్ని విమర్శించే వారిపై కచ్చితంగా తిరగబడాలని పిలుపునిచ్చారు.. సీఎం జగన్ కు కనీసమద్దతు ఇవ్వకపోతే టీడీపీ ఇంకా రెచ్చిపోతుందన్న ఆయన.. ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వకపోతే మనం బలహీనులం అయిపోతాం అన్నారు.. ఇక, ఈ సందర్భంగా టీడీపీ నేతలకు సవాల్ విసిరిన ఆయన.. ఏ వేదికపై చర్చించడానికి వస్తారో రమ్మనండి .. వైసీపీలో సామాన్యకార్యకర్తను పంపిస్తా…. మాతో చర్చకు వస్తారా? అంటూ సవాల్ చేశారు.