NTV Telugu Site icon

Ambedkar Konaseema: అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఐడీ కార్డు ఉంటేనే అనుమతి

Ambedkar Konaseema

Ambedkar Konaseema

Andhra Pradesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశించింది. అయితే పసలపూడి గ్రామానికి చేరుకోగానే అమరావతి రైతులకు నిరసన సెగ తగిలింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు అమరావతి రైతుల యాత్రకు అడ్డుతగిలారు. అటు పోలీసులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకున్నారు. హైకోర్టు కేవలం 600 మందికే అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులతో అమరావతి రైతులు వాగ్వాదానికి దిగారు. ఐడీ కార్డులు చూపించిన వారిని మాత్రమే పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే హైకోర్టు అనుమతులతోనే తాము పాదయాత్ర చేస్తున్నామని రైతులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. అటు పోలీసులు, రైతులకు వాగ్వాదం జరిగిన క్రమంలో ఓ మహిళా రైతు తలకు గాయం కాగా.. ఆమె అక్కడే సొమ్మసిల్లిపడిపోయారు. మొత్తంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. చాలాసేపటి తర్వాత రైతుల పాదయాత్ర ముందుకు కదిలింది.

అటు అమరావతి రైతుల పాదయాత్ర సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో వ్యాపార, వాణిజ్య దుకాణాలను వైసీపీ శ్రేణులు మూసివేయించి నిరసన వ్యక్తం చేశాయి. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని.. మూడు రాజధానులకే తమ మద్దతు ఉంటుందంటూ స్టిక్కర్లను షాపులకు అతికించి నిరసన తెలిపాయి. పసలపూడిలో గాంధీ విగ్రహం వద్ద బ్లాక్ దుస్తులు ధరించి బ్లాక్ బెలూన్‌లతో వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ శ్రేణులు అమరావతి పాదయాత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాపాద యాత్ర చేస్తున్న వారి బుద్ధిని మార్చాలంటూ వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలియజేశాయి.

Read Also: Monkey Video: అన్నంపెట్టిన వ్యక్తి మృతి.. కన్నీళ్లు పెట్టుకొని నివాళులు అర్పించిన కోతి

కాగా నవంబర్ 1 న సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ జరగనుంది. రాజధాని అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో నవంబర్ 1న విచారణకు జస్టిస్ యూయూ లలిత్ అనుమతి ఇచ్చారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును గత నెలలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియేట్ పిటిషన్‌లను అమరావతి రైతులు దాఖలు చేశారు.

Show comments