NTV Telugu Site icon

కోవిడ్‌ నిబంధనలు పాటించండి.. కేరళ పరిస్థితి రావొద్దు..!

పండుగల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓనమ్ పండుగ తర్వాతే కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభించాయని గుర్తుచేశారు… కరోనా నిబంధనలు పాటించాలని అలాంటి పరిస్థితి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పలుచోట్ల కోవిడ్ పాజిటివిటీ రేటు 13శాతం ఉందని గుర్తుచేసిన మంత్రి.. వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. అయితే, పండుగలను కూడా కొన్ని పార్టీలు రాజకీయం చేయడం దురదృష్టకరం అని మండిపడ్డ మంత్రి వేణు గోపాలకృష్ణ.. అన్ని మతాలను సీఎం వైఎస్‌ జగన్‌ సమదృష్టితో చూస్తారని స్పష్టం చేశారు. కాగా, వినాయక చవిత ఉత్సవాలకు అనుమతి ఇచ్చిన ఏపీ హైకోర్టు.. పబ్లిక్‌ ప్లేస్‌ల్లో కాకుండే ప్రైవేట్‌ ప్లేస్‌ల్లో పెట్టుకోవాలని.. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. ఒక్కసారి ఐదుగురికి మించకుండా చూసుకోవాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే.