తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైన జల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతూనే ఉంది.. ప్రధానికి, కేంద్రానికి, కృష్ణా రివర్ బోర్డుకు తాజాగా ఏపీ లేఖలు రాయడంపై భగ్గుమంటున్నారు తెలంగాణ మంత్రులు, నేతలు.. ఆ విమర్శలపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తెలంగాణ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయారు.. అక్కడా తెలుగువాళ్లున్నారు… ఇక్కడా తెలుగువాళ్లున్నారని.. బూతులు తిట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు.. ఎప్పుడో చనిపోయిన వైఎస్సార్ గురించి మాట్లాడటం వారి సంస్కారానికే వదిలేస్తున్నామన్న ఆయన.. వైఎస్సార్ తెలంగాణకు నిజంగా అన్యాయం చేస్తే 2009లో అత్యధిక సీట్లు ఎలా గెలిచారు..? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజలు వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారన్న మంత్రి అనిల్.. ఏపీకి కేటాయించిన వాటాకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నాం అని స్పష్టం చేశారు.
తెలంగాణ నేతలకు చిత్తశుద్ధి ఉంటే వారి పరిధిలో ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్… పదే పదే అన్యాయం చేశామంటున్నారు… మేం ఏమి అన్యాయం చేశామని ప్రశ్నించిన ఆయన.. వ్యవసాయానికి నీరందకుండా పవర్ ఆన్ చేశారు … అది ఎంత దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.. పులిచింతల , నాగార్జున సాగర్ , శ్రీశైలం నుంచి నీరు సముద్రాల్లోకి వదిలేయాల్సి వస్తోందన్నారు. మరోవైపు.. ఇద్దరు సీఎంలకు లోపాయికారి ఒప్పందం ఉందని ఒకాయన మాట్లాడుతున్నాడు తున్నారని ప్రతిపక్ష నేతలపై మండిపడ్డ మంత్రి అనిల్.. అలా మాట్లాడటానికి ఆయనకు బుద్ధుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు సంబంధించి సానుకూలంగా ఒక్కమాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించిన ఆయన.. ఏపీ ప్రాజెక్టులను తెలంగాణ వ్యతిరేకిస్తుంటే.. ఈ రోజుకీ టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పలేకపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలను పక్కనపెట్టి ఒకే తాటిపై నిలబడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటుకు తంతే ఏపీలో పడ్డాడు.. ఏపీ ప్రజలు తంతే హైదరాబాద్ లో పడ్డాడు.. హైదరాబాద్ లో దాక్కున్న బాబు , చినబాబులను కేసీఆర్ ఎక్కడ మొత్తుతాడోనని భయం పట్టుకుందని.. మళ్లీ ఎక్కడ తంతాడోనని హైదరాబాద్ లో కూర్చుని వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు అనిల్.. కేఆర్ఎంబీకి, ప్రధానికి , కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం.. మేం రాసిన లేఖలు కనిపించడం లేదా..? అంటూ నిలదీశారు.