Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు

  • పాత ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం
  • ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయంటూ సజ్జల ఆరోపణలు
  • పారామిలిటరీ బలగాలను దించాలని డిమాండ్
  • కూటమి హామీలపై ప్రజలు నిలదీయాలన్న వైఎస్సార్‌సీపీ నేత
Sajjala

Sajjala

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వంపై, రాష్ట్ర ఎన్నికల అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పాలనపై తమకు పూర్తి నమ్మకముంటే అధికారంలో ఉన్నవారు ఎన్నికల నిర్వహణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

దొంగ ఓట్లతోనే ఎన్నికల కుట్ర.. కేంద్ర ఎన్నికల సంఘంపై అనుమానాలు

గతంలో సర్వేల ద్వారా తొలగించిన సుమారు 44 లక్షల దొంగ ఓట్లను ఆధారంగా చేసుకుని ఎన్నికలకు వెళ్లవద్దని తాము విజ్ఞప్తి చేశామని సజ్జల వెల్లడించారు. ఆ ఓట్లను మేనేజ్ చేసుకుని అక్రమాలకు పాల్పడేందుకే ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను గమనిస్తుంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) కూడా ఇందులో ప్రమేయం కలిగి ఉందేమోనన్న తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ నెల 16వ తేదీన కొత్త ఓటర్ల జాబితా ఇస్తామని చెప్పిన అధికారులు, ఉన్నపలంగా 19వ తేదీ నుంచి పాత ఓటర్ల లిస్టుతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంలోని అంతరార్థం ఏంటని నిలదీశారు. ప్రజలంతా దసరా పండుగ హడావుడిలో ఉన్న సమయాన్ని చూసి ఉన్నపలంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు.

మా కాళ్లు చేతులు కట్టేసి ఎన్నికలు జరుపుతున్నారు..  

పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవని, అసలు ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో స్పష్టత లేదని సజ్జల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి కూర్చోబెట్టి ఎన్నికలు నిర్వహించుకుంటామని ప్రభుత్వం అంటోందని ఎద్దేవా చేశారు. బరితెగించి అక్రమాలు చేస్తూ, తిరిగే తమ పార్టీపైనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమికి చెందిన సోషల్ మీడియా ఫ్యాక్టరీలలో ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో అత్యంత ఆవేశకావేశాల మధ్య జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో ఇంతకంటే బరితెగించి ప్రవర్తిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు.ందుకే తాము పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

కూటమి హామీలపై ప్రజలు నిలదీయాలి

కూటమి నేతలు చెబుతున్నట్లుగా ఇవి ఏకగ్రీవాలు కావని, తమ అభ్యర్థులు పోటీలో లేరనడం శుద్ధ అబద్ధమని సజ్జల స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పిస్తే ఇప్పటికీ తమ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరారు. ఇటువంటి వ్యవస్థను ప్రజాస్వామ్యం అనుకోవడం సిగ్గుచేటని, దీనికి ఒకరు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాబోయే ప్రచారంలో కూటమి నేతలు ఇంకా ఎన్ని అక్రమాలకు ఒడిగడతారోనని అన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే కూటమి నాయకులను ఇచ్చిన హామీలపై ప్రజలు గట్టిగా ప్రశ్నించాలని, కూటమి ప్రభుత్వం చేసిన మోసాలకు ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని సజ్జల పిలుపునిచ్చారు.