ఏపీలోని వేలాది దేవాలయాల సమీపంలో స్టాళ్ళ ద్వారా భక్తులకు కావాల్సిన కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అరటిపళ్ళు విక్రయిస్తూ వుంటారు. అయితే రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏపీలో దేవాలయాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను కంట్రోల్ చేసేందుకు ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరలను నియంత్రించేలా దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ సర్కులర్ జారీచేశారు. దేవాలయ ప్రాంగణంలోని లైసెన్స్ కలిగిన షాపుల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరిగేలా చూడాలని ఈవోలకు ఆదేశం ఇచ్చారు.
కొబ్బరి కాయలు, పూలు, పళ్లు, తినుబండారాల ధరలను ఈవోనే నిర్దేశించాలని స్పష్టీకరణ. దుకాణదారులతో చర్చించి ధరలను నిర్ధారించాలని సూచించారు. దేవాలయాలకు వచ్చే భక్తులతో ఎలా వ్యవహరించాలన్న అంశం పైనా దుకాణదారులకు అవగాహన కల్పించాలని దేవాదాయ శాఖ. భక్తులతో దురుసుగా ప్రవర్తించినా.. ఎక్కువ ధరలకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామనే విషయాన్ని టెండర్, ఆక్షన్ నిబంధనల్లో పొందుపరచాలని దేవాదాయ శాఖ తెలిపింది.
దేవాలయాల సమీపంలోని ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకునే స్టాళ్లల్లోనూ ధరల నియంత్రణపై దృష్టి సారించాలంది దేవాదాయ శాఖ. ప్రైవేట్ స్టాళ్లల్లో ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ సాయం తీసుకోవాలని కమిషనర్ సూచనలు చేశారు. పూర్తి స్థాయి పర్యవేక్షణ నిమిత్తం విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ పేర్కొన్నారు.
