Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కల్లుగీత కార్మికుల కుటుంబాలకు పరిహారం రెట్టింపు

Kallu Geetha Karmikulu

Kallu Geetha Karmikulu

Andhra Pradesh:  ఏపీలోని జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు గీత కార్మికులు మరణిస్తే… వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం రెండింతలు చేసింది. ఈ మేరకు రానున్న ఐదేళ్లకు (2022-27) కల్లు గీత నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం కల్లు గీత కార్మికులు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. నూతన కల్లు గీత విధానం ద్వారా ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచిరూ.10 లక్షలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

Read Also: Sabari Express: పట్టాలపై అడ్డంగా రాడ్డు.. శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

మరోవైపు నరేగా, ఇతరత్రా ప్రభుత్వ పథకాల ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకుంటామని తన నూతన విధానంలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కల్లు గీత కార్మికులకు వైఎస్సార్ బీమాను వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గీత కార్మికుల నుంచి వసూలు చేస్తున్న తాటిచెట్టు అద్దెను రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించనున్నారు. వీరికి వైఎస్సార్‌ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నారు.

Exit mobile version