Site icon NTV Telugu

Andhra Pradesh: తిరుపతిలో గోడలపై వైసీపీ రంగులు.. వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

Ap Fact Check

Ap Fact Check

Andhra Pradesh: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలపై వైసీపీ రంగులు, రోడ్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగాయి. గోడలపై ఉన్న దేవుడి బొమ్మలు తొలగించి వైసీపీ రంగులు వేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది. తిరుపతి నగరంలోని గోడ చిత్రాలపై జరుగుతున్న ప్రచారం దురుద్దేశపూరితంగా చేస్తున్నారని విమర్శించింది. తిరుపతి నగర వ్యాప్తంగా వెలిసిపోయిన గోడ చిత్రాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త కళాకృతులను చిత్రీకరించే పనులు కొనసాగుతున్నాయని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. అందులో భాగంగా పలువురి జాతీయనేతల చిత్రాలను నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో గోడలపై చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించింది.

కాగా తిరుపతిలో రోడ్డు పక్కన ఉండే గోడల సుందరీకరణ కార్యక్రమం దశల వారీగా జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. అంతగా బాధపడిపోతున్న నేతలు ఒకసారి వచ్చి ఇక్కడ చేపడుతున్న కళాకృతులను చూసి, అభినందించాల్సిందిగా కోరుతున్నామని సూచించింది. అయితే టీడీపీ మాత్రం మరోలా స్పందించింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. కొందరు వైసీపీ నేతలు దురుద్దేశంతోనే గోడలకు వైసీపీ రంగులు వేశారని మండిపడింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Exit mobile version