YSRCP Nomination Row: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థులపై దాడుల అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే తమ పార్టీ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసులపై ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 44 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని చెబుతున్నారని సజ్జల అన్నారు. అనుమానాస్పద ఓట్లపై స్పష్టత లేకుండానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను ఎన్నికలకు రెండు రోజుల ముందే ప్రకటించారని, కేవలం 12 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
నామినేషన్ల దాఖలుకు రోజుకు నాలుగు గంటల సమయం మాత్రమే ఇవ్వడం, మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలనుకోవడం వల్ల తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారికి ముందుగానే అన్ని వివరాలు తెలుస్తాయని, తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి జరిగిందని, నాలుగు గంటల పాటు వేచి ఉన్నప్పటికీ నామినేషన్ పత్రాలను స్వీకరించలేదని సజ్జల ఆరోపించారు. తమ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడించినా పత్రాలు తీసుకోలేదని అన్నారు.
రాయచోటిలో వైసీపీ పార్టీ కార్యాలయానికి నిప్పంటించారని ఆరోపిస్తూ, ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, సీసీ కెమెరాలు కూడా లేని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వైసీపీ నేతలు నామినేషన్లు వేసేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని, టీడీపీ అభ్యర్థులకు మాత్రం సహకరిస్తున్నారని సజ్జల అన్నారు. ఘటనలకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ తమ పార్టీ వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సజ్జల పేర్కొన్నారు. గురజాలలో అభ్యర్థులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆరోపిస్తూ, వారి కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. బద్వేలులో వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను టీడీపీకి చెందినవారు తీసుకెళ్లారని ఆరోపించారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి నామినేషన్ కేంద్రానికి వెళ్లినప్పటికీ, సమయం ముగిసే వరకు రోడ్డుపైనే ఉంచారని విమర్శించారు. పులివెందులలో పోలీసులే కాల్పులు జరిపి వాహనాలపై దాడులు చేశారని సజ్జల ఆరోపించారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి, గూండాల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉందని సజ్జల అన్నారు. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, వాటిని తిరిగి డీజీపీకి పంపిస్తున్నారని విమర్శించారు. ఫిర్యాదులపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంటే రాష్ట్రపతి పాలన విధించి, ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్లు చేసుకునే అవకాశం కల్పించినట్లేనని వ్యాఖ్యానించారు. తమ పార్టీ న్యాయపోరాటం కొనసాగిస్తుందని, కోర్టులను ఆశ్రయిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనపై ప్రజల తీర్పును ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడుతున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాన్ని కోరడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని అన్నారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీని అడ్డదారుల్లో నామినేషన్లు వేయకుండా చేయాలని చూస్తోందని ఆరోపించారు. పోలింగ్ రోజున ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని, టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలను గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ వెంట ఉన్నారని, ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొంటామని సజ్జల స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించి, ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలని సజ్జల కోరారు. ఎన్నికల సమయంలో భయాందోళనలు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు.

