వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. కేబినెట్ నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సమావేశంలో కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. నవంబరు 30 తేదీనాటికల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల చేపట్టాల్సిందిగా మెమో జారీ చేశారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ సూచనలు చేశారు.
గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయిలో హెచ్ఓడీలు.. ఉన్నతాధికారుల వరకూ ఇక నుంచి ఇ-ఫైలింగ్ ద్వారానే దస్త్రాలను రూపొందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక యూనిక్ ఐడీని ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ కార్యదర్శికి సూచనలు చేశారు. భవిష్యత్తుకు తగిన విధంగా అన్ని ప్రభుత్వ శాఖలూ రీ-ఓరియంటేషన్ కావాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్కువ నిధులు ఎలా రాబట్టుకోవాలన్న అంశాలపై దృష్టి పెట్టాలని అన్ని శాఖల కార్యదర్శులకూ ప్రత్యేకంగా ఆదేశాలిచ్చింది.
కోర్టు కేసుల విషయంలో ముందస్తు సమాచారంతో పాటు కోర్టులో దాఖలు చేయాల్సిన కౌంటర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎస్ సమీర్ శర్మ. 2019 నుంచి ఇప్పటి వరకూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో రెవెన్యూ శాఖలోనే ఎక్కువ శాతం పెండింగ్ లో ఉన్నట్టు సమావేశంలో పేర్కొన్నారు సీఎస్. ఆర్టీసీలో 55,500 మంది ఉద్యోగులను ప్రభుత్వంలో తీసుకున్నందున కేడర్ స్థాయిని స్పష్టం చేయాల్సి ఉందని సమావేశంలో చర్చించారు. ఇక నుంచి ప్రతీ నెలా మొదటి బుధవారం అన్ని శాఖల కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించాలని సీఎస్ ఆదేశాలు జారీచేశారు.